
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన శుక్రవారం తెలంగాణా భవన్లో తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలాఖరులోగా లేదా అక్టోబర్ మొదటివారంలో టిఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సంబందించి న్యాయపరమైన అవరోధాల గురించి న్యాయ నిపుణులతో చర్చిస్తానని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపిక మొదలైన అంశాలు తనకు వదిలిపెట్టి, పార్టీ నేతలందరూ ప్రజలలోకి వెళ్ళి టిఆర్ఎస్ సర్కారు చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న అవుటర్ రింగ్ రోడ్డులో జరుపబోయే ‘ప్రగతి నివేధన సభ’లోనే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నందున, ఆ సభకు కనీసం 25 లక్షల మందిని జనసమీకరణ చేసి విజయవంతం చేయాలని కెసిఆర్ పార్టీ నేతలను కోరారు.
టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పూర్తికాగానే సిఎం కెసిఆర్ డిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోడీని కలిసి ముందస్తు ఎన్నికల నిర్వహణ గురించి చర్చించబోతున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ నెలాఖరులోగా అభ్యర్ధులను ప్రకటించేసిన తరువాత సిఎం కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. కనుక ఈ లెక్కన నవంబర్ నెలాఖరులోగా లేదా డిసెంబర్ మొదటివారంలో తెలంగాణా శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.