
తెలంగాణాలో పలుజిల్లాలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షాలు పడటంతో అనేక గ్రామాలు, లక్షలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. ఒకపక్క అల్పపీడనం, మరోపక్క ఉపరితల ఆవర్తనం, ఇంకో పక్క నైరుతీ రుతుపవనాలు కమ్ముకోవడం వలననే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయీ. ఈరోజు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెపుతున్నారు.
ఆర్మూర్ లోని మగిది, కలదుర్గి, భోధన్ లోని చిన్న మావంది, నిజామాబాద్ జిల్లాలోని చిమన్ పల్లిలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు 11.3-12.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక పంజల్, బాసర, ఒకులం, జైనూరు, రెబ్బన, ఎడపల్లి, జానకం పేట తదితర ప్రాంతాలలో 10.1 నుంచి 10.8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
నిన్న కురిసిన భారీ వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఎక్కువ నష్టపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలో దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు జిల్లాలలో నిన్న కురిసిన వర్షాలకు అనేక ఇళ్ళు కూలిపోయాయి. కానీ అధికారులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రాణనష్టం తప్పింది. అయినప్పటికీ వేర్వేరు ప్రాంతాలలో నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో పలు ప్రాంతాలు ముఖ్యంగా ఉట్నూర్, కౌతల, సోన్, ఇచ్చోడ, మామడ, సిర్పూర్ (టి) ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్ళు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు
కరీంనగర్ మెట్పల్లిలో వట్టివాగు, అక్సాయిపల్లె వాగు, సిర్పూర్ (యు) మండలంలోని జీర్లఘాట్ వాగు, జన్నారం వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల పంట పొలాలలోకి, రోడ్లపైకి నీళ్ళు చేరాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మకూరు మండలంలో కటాక్షాపూర్ చెరువు నిండిపోయి 163వ జాతీయ రహదారిపైకి నీళ్ళు పారుతున్నాయి.
ఇక మందమర్రి, మంచిర్యాల, కళ్యాణఖని, శ్రీరామ్ పూర్ రామకృష్ణా పూర్ బొగ్గు గనులలోకి నీళ్ళు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సత్తుపల్లి మండలంలోని మేడిశెట్టివారిపాలెం మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. ఈరోజు కూడా ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు కనుక ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.