
కేరళ వరదలు ‘తీవ్ర విపత్తు’గా గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాంతో కేరళ రాష్ట్రానికి ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన రూ.600 కోట్లు ఆర్ధిక సాయానికి ఆధనంగా కేంద్రం నుంచి చాలా భారీగా నిధులు అందే అవకాశం ఉంది. కేరళ వరదలను తీవ్ర విపత్తుగా ప్రకటించినందున కేరళను ఆదుకోవడానికి జాతీయ విపత్తు సహాయనిధి ఏర్పాటవుతుంది. దీనికి కేంద్రం మూడొంతులు, కేరళ ప్రభుత్వం ఒక వంతు నిధులు సమకూరుస్తాయి. అదీగాక జాతీయ విపత్తు అత్యవసర నిధి నుంచి కేంద్రం 100 శాతం నిధులు విడుదల చేస్తుంది. అంతేగాక తీవ్ర విపత్తు గుర్తింపు లభించింది కనుక కేరళలో వరద తాకిడికి గురై నష్టపోయిన ప్రజలకు రుణాల చెల్లింపులకు గడువు పొడిగించబడుతుంది. అలాగే పలు రాయితీలు కూడా లభిస్తాయి. మళ్ళీ కొత్త ఇళ్ళు నిర్మించుకోవడానికి కేంద్రప్రభుత్వం పధకాలు, నిధులు మంజూరు చేస్తుంది.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏవి ధర్మారెడ్డి నేతృత్వంలో అంతర్ మంత్రివర్గ బృందం ఒకటి ఆగస్ట్ 8వ తేదీన కేరళలో పర్యటించినఅక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత కేరళ ‘తీవ్ర విపత్తు’ లో చిక్కుకొందని అందుకు అనుగుణంగా సాయపడాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సిఫార్సు చేసింది. కనుక ఇక నుంచి కేరళకు కేంద్రం నుంచి భారీగా నిధులు అందవచ్చు.
తాజా సమాచారం ప్రకారం సోమవారం నుంచి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కనుక మళ్ళీ వర్షాలు పడకపోతే క్రమంగా వరద ఉదృతి కూడా తగ్గవచ్చు.