ఇండియన్ నేవీకి శాల్యూట్ చేయక తప్పదు

కేరళ వరదలలో చిక్కుకొన్న ప్రజలను కాపాడటంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చూపుతున్న చొరవ, ధైర్యసాహసాలకు యావత్ దేశప్రజలు ‘ఫిధా’ అవుతున్నారు. ఈరోజు కేరళలో చాలకుడి అనే ప్రాంతంలో వరదలలో చిక్కుకుపోయిన 26 మందిని రక్షించేందుకు ఇండియన్ నేవీ సిబ్బంది చేసిన అపూర్వ సాహసం చూసి ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. 

తీవ్ర వరదల కారణంగా ఆ ప్రాంతానికి సహాయ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. దాంతో ఇండియన్ నేవీకి చెందిన సీకింగ్ 42బి హెలికాఫ్టర్ వారిని రక్షించేందుకు బయలుదేరింది. కానీ ఆ ప్రాంతానికి చేరుకొన్న తరువాత హెలికాఫ్టర్ దిగడానికి ఎక్కడా తగిన స్థలం కనిపించలేదు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో హెలికాఫ్టరును అదే భవనంపై దించి అక్కడున్న వారిని అందరినీ కాపాడాలని నిర్ణయించారు. కానీ హెలికాఫ్టర్ భవనంపై దించితే దాని బరువుకు భవనం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక హెలికాఫ్టర్ చక్రాలు భవనంపై ఆన్చకుండా, రెండు మూడు అంగుళాల ఎత్తులో గాలిలో తేలుతూ ఉండేలా హెలికాఫ్టర్ ను స్థిరంగా నిలిపి ఉంచి ఆ భవనంలో చిక్కుకొన్న వారినందరినీ హెలికాఫ్టర్ లోకి ఎక్కించుకొని సురక్షిత ప్రదేశానికి తరలించారు. 

అంతా భారీ హెలికాఫ్టర్ గాలిలో ఎంతసేపైనా స్థిరంగా నిలిచి ఉండగలదు కానీ అంత తక్కువ ఎత్తులో ఒక భవనంపై కదలకుండా స్థిరంగా ఉంచడం చాలా కష్టం. కానీ లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిజిత్‌ గార్డ్‌ (ప్రధాన పైలట్), లెఫ్టినెంట్‌ కమాండర్‌ రజనీష్‌ (కో-పైలెట్‌), లెఫ్టినెంట్‌ సత్యార్థ్‌ (నావిగేటర్‌), అజిత్‌ (వించ్‌ ఆపరేటర్‌), రాజన్‌ (ఫ్రీ డైవర్‌) అందరూ చక్కటి సమన్వయంతో చాలా చురుకుగా, ధైర్యసాహసాలతో అసంభవాన్ని సంభవం చేసి చూపారు. అందరం కలిసి టీమ్-వర్క్ చేయడం వలననే ఇధి సాధ్యం అయ్యిందని లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిజిత్‌ గార్డ్‌ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ఇండియన్ నేవీ బృందం చేసిన ఈ సాహసాన్ని మీరూ చూడండి.