అప్పుడు కెసిఆర్‌పై పోటీ చేశారు కానీ...

2014 ఎన్నికలలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ పై కెసిఆర్‌ పై పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని నెలల క్రితమే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఇదివరకు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేశారు కనుక వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ పోటీ చేయాలనుకోవడం సహజమే. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అందుకు ఒప్పుకొంది కనుకనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన చెప్పుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని చెపుతున్నారు. కానీ అదే ఇప్పుడు సమస్యగా మారింది. ఆయన ఇంతకు ముందు కెసిఆర్‌పై పోటీ చేశారు కానీ టికెట్ సాధించుకోవడం కోసం ఇప్పుడు స్వంత పార్టీ నేతతోనే పోటీ పడవలసి వస్తోంది.        

గజ్వేల్ టికెట్ ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత బండారి శ్రీకాంత్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. కనుక తనను కాదని పార్టీలో కొత్తగా చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే సహించబోనని గట్టిగానే చెపుతున్నారు. అయితే వారిద్దరిలో ఎవరు టికెట్ సంపాదించుకొని పోటీ చేసినా కెసిఆర్‌ చేతిలో ఓడిపోవడం ఖాయం అని అందరికీ తెలుసు. కనుక గజ్వేల్ కాంగ్రెస్‌ టికెట్ కోసం కీచులాడుకోవడమే అనవసరం. కానీ కీచులాడుకొంటున్నారు కనుక ముందుగా ఆ పోటీలో నెగ్గి టికెట్ సంపాదించుకొన్న తరువాత కెసిఆర్‌పై గెలవడం గురించి వారు ఆలోచిస్తే మంచిదేమో?