
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణా ప్రభుత్వం తరపున సిఎం కెసిఆర్ రూ.25 కోట్లు సాయం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం త్రివేండ్రం వెళ్ళి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆ చెక్కును అందజేశారు. దానితో పాటు నీటిని శుద్ధి చేసేందుకు రూ.2.5 కోట్లు విలువగల ఆర్వో మెషిన్లను, రూ.52.5 లక్షలు విలువ చేసే 100 టన్నుల బాలామృతం (పౌష్టికాహారం) పొట్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ద్వారా కేరళకు పంపించింది. కేరళ ప్రభుత్వం సూచించిన ప్రాంతాలలో ఆర్వో మెషిన్లను ఏర్పాటుచేసి నీటిని శుద్ధిచేసి స్థానిక ప్రజలకు అందించేందుకు 30 మంది సిబ్బందిని కూడా తెలంగాణా ప్రభుత్వం కేరళకు పంపించింది. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట లింగారెడ్డి తమ ఒక నెల జీతాన్ని కేరళకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.