కేరళ వరద భాదితులకు తెలంగాణా ప్రభుత్వం తరపున సిఎం కెసిఆర్ నిన్న రూ.25 కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించారు. దానితోపాటు రూ.25 లక్షలు విలువచేసే నీటిని శుద్ధి చేసే ఆర్వో మెషిన్లను కూడా పంపిస్తున్నారు. కేరళ వరదలలో చిక్కుకొన్న కుటుంబాలలో చిన్నారులు ఆహారం లభించక ఆకలితో బాధపడుతున్నారని తెలుసుకొన్న సిఎం కెసిఆర్ ఇవాళ్ళ రూ.52.5 లక్షలు విలువ చేసే 100 టన్నుల బాలామృతం (పౌష్టికాహారం) పొట్లాలను కేరళకు పంపించవలసిందిగా ఆదేశించడంతో ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి కేరళకు ప్రత్యేక విమానంలో వాటిని తరలించినట్లు తెలంగాణా ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజయేంద్ర బోయే తెలిపారు.
నాచారంలోగల తెలంగాణా ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఈ బాలామృతాన్ని రాష్ట్రంలో అంగన్ వాడీలకు, మాతాశిశు శరణాలయాలకు సరఫరా చేస్తుంటారు. ఏడు నెలల పిల్లల నుంచి మూడేళ్ళు వయసున్న పిల్లలకు ఈ బాలామృతాన్ని ఆహారంగా ఇస్తారు. దానిలో పసిపిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అవే ప్యాకెట్లను ఇవాళ్ళ కేరళకు పంపించారు.