అది కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనం: కాంగ్రెస్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగస్ట్ 14వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశం అయ్యేందుకు అనుమతి నిరాకరించినందుకు టి-కాంగ్రెస్ నేతలు సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఈ నిర్ణయం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనం. తెలంగాణా ఇస్తే సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొంటానని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటి? రాహుల్ గాంధీ ఓయు విద్యార్దులతో సమావేశం అవుదామనుకొంటే కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అనుమతి నిరాకరించారు?” అని ప్రశ్నించారు. బైసన్ పోలో మైదానం జోలికి వస్తే నిరాహార దీక్ష చేస్తానని వి.హనుమంతరావు సిఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.                  

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, గీతారెడ్డి, మధుయాష్కీ ముగ్గురూ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. “సిఎం కేసీఆర్‌ చాలా అహంభావంతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటు చేసింది కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురు సభ్యుల కోసం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల కోసం. కానీ అయన ఇది తన కుటుంబ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తనను ప్రశ్నించే గొంతులకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. కానీ కేసీఆర్‌ ఎన్ని అవరోధాలు సృష్టించినా కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఆపలేరు. ముళ్ళకంచెలు అడ్డుపెట్టినా వాటిని దాటుకొని ఓయులోకి వెళ్లి తీరుతాం. అక్కడ రాహుల్ గాంధీ సభ పెట్టి చూపిస్తాం,” అన్నారు భట్టి విక్రమార్క.

గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు బారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. పవిత్రమైన యాదగిరిగుట్ట వద్ద చిన్న పిల్లలతో వ్యభిచారకూపాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి కనబడదు. కానీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో మాట్లాడితే భద్రతా సమస్యలు వస్తాయిట! రాష్ట్రానికి పెద్ద సచివాలయం ఉండగా దానిలో ఏనాడు అడుగుపెట్టని సిఎం కేసీఆర్‌ బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయం ఎందుకు నిర్మించాలనుకొంటున్నారు?” అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ నేతలు కేవలం ఈ విమర్శలతో సరిపెట్టుకొంటారనుకోలేము. రేవంత్ రెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు ఎవరో ఒకరు ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషను వేయవచ్చు. ఒకవేళ హైకోర్టు అనుమతించినట్లయితే అప్పుడు ప్రభుత్వానికే అప్రదిష్ట. కనుక రాహుల్ గాంధీ సభకు అనుమతించడమే మంచిదేమో!