రాష్ట్రంలో సబ్సీడీ బర్రెల పంపకం షురూ

గ్రామాలలో నివసిస్తున్న వారికి అక్కడే జీవనోపాధి కల్పించాలనే ప్రయత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి సబ్సీడీ బర్రెల పంపిణీ పధకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పధకాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలో ములకనూర్ గ్రామంలో ప్రారంభిస్తారు. వారు వంద మంది పాడిరైతులకు బర్రెలు అందించి లాంఛనంగా ఈ పధకాన్ని ప్రారంభిస్తారు.

ఈ పధకం మొదటిదశలో భాగంగా మొత్తం 1,82,823 బర్రెలను పంపిణీ చేస్తారు. వాటిలో ముల్కనూర్ మహిళా డెయిరీలో సభ్యులుగా ఉన్న 19,307 మంది పాడి రైతులకు, విజయ డెయిరీలోని 63,304మందికి, కరీంనగర్‌ డైరీలోని 57,206మందికి, మదర్ డైరీలోని 43,006 మంది సభ్యులకీ బర్రెలను ప్రభుత్వం రాయితీపై అందించబోతోంది. వీటిపై ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్లు రాయితీ ఇవ్వబోతోంది. 

ఒక్కో బర్రె ధర రూ.80,000గా నిర్ణయించింది. దానిలో బిసిలకు 50 శాతం, ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం  రాయితీ ఇస్తోంది. అంటే రూ.80,000 ఖరీదు చేసే ఒక్కో బర్రె బిసిలకు రూ.40,000 లకు, ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.20,000 లకే అందిస్తోందన్న మాట. ఈ పధకానికి ఎంపిక చేసిన లబ్దిదారులు అందరూ ఇప్పటికే వివిధ డైరీలకు పాలు సరఫరా చేస్తున్న పాడి రైతులే కనుక వారు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన ఈ మేలుజాతి బర్రెలను చక్కగా పోషించుకొంటూ మరింత ఆదాయం పొందడం తధ్యం.