ఏపి అభ్యర్ధులకు టికెట్లు ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వచ్చే ఎన్నికలలో హైదరాబాద్‌ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమవాసులకు వారి జనాభా ఆధారంగా ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే వారికీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమ ప్రజలు గ్రేటర్ ఎన్నికలలో తెరాసకే ఓట్లు వేసి గెలిపించినప్పటికీ, వచ్చే ఎన్నికలలో వారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని భావిస్తున్నామని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వరి సమస్యలను పరిష్కరించదానికి ప్రాధాన్యత ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని, ఒంటరిగా పోటీ చేసినా లేదా పొత్తులు పెట్టుకొన్నా తమకి ఖచ్చితంగా 75 సీట్లు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

తెరాసలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ గౌరవం లభించదని, ఆ కారణంగా తెరాసలో నేతలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. తెరాసలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తప్ప మిగిలినవారిలో చాలా మంది నేతలు తమతో టచ్చులో ఉన్నారని, ఈ నెలాఖరులోగా తెరాసతో సహా ఇతర పార్టీల నుంచి అనేక మంది ప్రముఖ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. 

‘ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నేతలను చేర్చుకొని వారికి టికెట్లు కేటాయిస్తే పార్టీలో నేతలు తిరుగుబాటు చేయవచ్చు కదా?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి పదవులు ఆశించకుండా వచ్చే వారినే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. అయినా పార్టీ ప్రయోజనాల కోసం కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి అని అన్నారు. 

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా, ఎన్నికల తరువాత మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దానిపై తగిన నిర్ణయం తీసుకొంటారు. అయన నిర్ణయమే ఫైనల్. అందరికీ శిరోధార్యం,’ అని చెప్పారు. 

ఆగస్ట్ 13,14 తేదీలలో రాహుల్ గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో రూ.2లక్షలు పంట రుణాల మాఫీ, ఉద్యోగాల కల్పన, భర్తీ, రైతులు, మహిళలకు కొన్ని హామీలు ప్రకటించవచ్చునని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.      

తెలంగాణా కాంగ్రెస్ లో కమిటీలు ఎప్పుడు వేస్తారనే ప్రశ్నకు ‘ఎన్నికలకు వెళుతున్న ఇతర రాష్ట్రాలలో ఎప్పుడు కమిటీలు వేస్తే అప్పుడే,’ అని సమాధానం ఇచ్చారు.