ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఎల్బీ నగర్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. దీనికోసం రూ.49కోట్లు ఖర్చు అయ్యింది. సుమారు ఒక కిమీ పొడవుండే ఈ ఫ్లై ఓవర్‌ను కేవలం 16 నెలలోనే నిర్మించడం విశేషం. ఈ ఫ్లై ఓవర్‌ వలన కామినేని చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు కొంత తగ్గుతాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం 23,000 కోట్లతో నగరంలో ఇంకా అనేక ఫ్లై ఓవర్లు, అండర్-పాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. అవన్నీ పూర్తయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశిస్తున్నాము. రూ.450 కోట్లు ఖర్చు చేసి ఎల్బి నగర్ ప్రాంతంలో  రోడ్ల విస్తరణ పనులు కూడా చేపట్టాము. నగర ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎక్కువగా వినియోగించుకోవడం అలవాటు చేసుకొన్నప్పుడే ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించబడతాయి. 

త్వరలో ఎల్బీ నగర్ నుంచి మెట్రో సేవలు మొదలవుతాయి కనుక ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇంకా తగ్గుతుందని ఆశిస్తున్నాము. ఈ ఆగస్ట్ 15వ తేదీ నుంచే ఎల్బీ నగర్-అమీర్ పేట కారిడార్ లో మెట్రో సర్వీసులు ప్రారంభించాలనుకొన్నాము. కానీ మెట్రో సెఫ్టీ అథారిటీ నుంచి అనుమతి లభించనందున మెట్రో సర్వీసులు ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది,” అని చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మొదలైన పధకాల పురోగతి గురించి మంత్రి కేటీఆర్‌ మీడియాకు వివరించారు.

ఎల్బీ నగర్ వద్ద నిర్మించిన ఈ కొత్త ఫ్లై ఓవర్‌కు, మెట్రో స్టేషన్ కు తెలంగాణా అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని అతని తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.