డి.శ్రీనివాస్ కొడుకు సంజయ్‌కు నోటీసులు

రాజ్యసభ సభ్యుడు, తెరాస సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కొడుకు సంజయ్‌కు నిజామాబాద్‌ పోలీసులు నోటీసులు అందజేశారు. శనివారం తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో కోరారు. అతను తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నిజామాబాద్‌లోని శాంఖరి నర్సింగ్ కాలేజీకి చెందిన 11మంది విద్యార్ధినులు నేరుగా హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డికి పిర్యాదు చేశారు. అయన వెంటనే స్పందించి డిజిపి మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించారు. డిజిపి ఆదేశాలమేరకు నిజామాబాద్‌ పోలీసులు సంజయ్‌పై నిర్భయ కేసుతో పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని పసిగట్టిన సంజయ్‌ గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వారికి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కనుక పోలీసులు నిన్న అతని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసి వచ్చారు. కానీ అతను ఈరోజు విచారణను ఎదుర్కొనేందుకు పోలీస్ స్టేషన్ వస్తారో లేదో అనుమానమే. ఒకవేళ రానట్లయితే అతనిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చు.