తెలంగాణ అంటేనే బీడు భూములు అనే భావనను దూరం చేసి, కరువు రక్కసిని తరిమికొట్టేందుకు తెలంగాణ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి సిఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రెండోదశ హరితహారంలో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటనున్నారు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, జనవాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హరితహారాన్ని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఓ ప్రజా ఉద్యమంలా నడవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. రెండు వారాల పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో చేపట్టాలని పిలుపునిచ్చారు. ఒకే ఏడాది 46 కోట్ల మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలుస్తుందన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ఎవరికి వారుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ఆయా శాఖలు మూడు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అన్ని చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారాలు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, నదులు, ఉపనదులు, కాలువలు, వొర్రెలు, వంకలు, చెరువు గట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.