రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్డీయే తరపున ఎంపి హరివంశ్ నారాయణ సింగ్ (జెడియు), యూపిఏ దాని మిత్రపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపి కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్లు వేశారు. ఈ పదవిని దక్కించుకోవాలంటే కనీసం 123 మంది ఎంపిల మద్దతు అవసరం.
రాజ్యసభలో మొత్తం 244 మంది ఎంపిలున్నారు. వారిలో అధికార ఎన్డీయే కూటమికి 73, కాంగ్రెస్ కూటమికి 50 మంది ఎంపిలున్నారు. కనుక ఇద్దరు అభ్యర్ధులకు ఇతర పార్టీలకు చెందిన ఎంపిల మద్దతు తప్పనిసరి. కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా తమ అభ్యర్ధికే ఎంపిల మద్దతు లభిస్తుందని గట్టిగా చెపుతున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే అభ్యర్ధికే ఇతర పార్టీల మద్దతు లభించవచ్చని స్పష్టం అవుతోంది.
భాజపాను, ప్రధాని మోడీని నిత్యం విమర్శించే శివసేన, భాజపాకు ఎన్డీయేకు దూరం జరుగుతున్న అకాలీదళ్, అలాగే ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (బిజెడి) ఎన్డీయే అభ్యర్ధికే మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెరాస తన వైఖరిని బయటపెట్టనప్పటికీ అది కూడా ఎన్డీయే ఎన్డీయే అభ్యర్ధికే మద్దతు ఈయవచ్చు.
తాజా లెక్కల ప్రకారం ఎన్డీయే అభ్యర్ధికి 126 మంది ఎంపిల మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక ఎన్డీయేకు చెందిన హరివంశ్ నారాయణ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.