
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ్యత్వ రద్దు కేసులో తెలంగాణా ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో కోర్టుధిక్కార నేరానికి పాల్పడినందుకు హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ శివశంకరరావు అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిణ సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు తీర్పును అమలుచేయనందుకు కటిన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించి, ఆగస్ట్ 3వ తేదీలోగా కోర్టు తీర్పును అమలుచేస్తారో లేదో స్పష్టం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్దరించే విషయంలో నేటికీ ప్రభుత్వ వైఖరి తెలియలేదు. కనుక ఈ కేసులో మళ్ళీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఆగ్రహానికి గురి కావలసివస్తుందనే ఆలోచనతో అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి తరపున అధనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజి) జె.రామచంద్రరావు హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు చేసుకొంటూ మరో పిటిషన్ వేశారు.
ఈ తాజా పిటిషను బుధవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.బాలకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై అత్యవసర విచారణ జరపనవసరం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ శివశంకరరావు తీర్పు చెప్పి 61 రోజులైనప్పటికీ అయన తీర్పును ఇంతవరకు అమలుచేయకుండా, తీర్పుపై ఇంతకాలం అప్పీలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. కోర్టు తీర్పులను తేలికగా తీసుకోవడం సరికాదని సున్నితంగా హెచ్చరించింది. ముందుగా కోర్టుధిక్కారకేసును ఎదుర్కొని, ఆ తరువాత తమ వద్దకు రావాలని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ్యత్వాలు రద్దు చేసి వారి స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ వ్రాసి వారిరువురికి పెద్ద షాక్ ఇచ్చామని తెరాస సర్కార్ భావిస్తే, చివరికి ఈ కేసు దాని మెడకే చుట్టుకోవడం విశేషం. అయితే, ఈ కేసులో నుంచి గౌరవంగా బయటపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ పంతానికి పోయి అటువంటి ప్రయత్నం చేయకపోవడం వలననే ప్రభుత్వానికి హైకోర్టులో ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పక తప్పదు.