తెలంగాణలో హైకోర్టు మీద పెద్ద రగడ మొదలయింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయాధికారులు ర్యాలీలు, ధర్నాలతో హొరెత్తిస్తుంటే.. తెలంగాణ సర్కార్ కూడా దీని మీద స్పీడు పెంచింది. కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్ వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. కాగా తాజాగా కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేస్తూ.. చంద్రబాబు సార్ అని సంబోధిస్తూ హైకోర్టు వివాదంపై వ్యాఖ్యానించారు.
హైకోర్టు విభజనపై ఏపీ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. అమరావతిలో సచివాలయం ప్రారంభమైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూనే, అమరావతిలో హైకోర్టు వద్దా అంటూ ట్విట్టర్ లో సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టుకు అంత ప్రాధాన్యత లేదా? అని అడిగారు. వెలగపూడిలో సచివాలయం ప్రారంభమైన రోజున.. ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. దీనికి బదులిస్తూ.. హైకోర్టుపై ప్రశ్నలు సంధించారు కేటీఆర్. రాష్ట్రంలో న్యాయాధికారుల ఆందోళనలు ఉధృతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.