
ఎన్.ఐ.ఏ.బృందాలు హైదరాబాద్లో పాతబస్తీలో సోమవారం ఆకస్మిక తనికీలు చేసి కొంతమంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్-టాప్, కొన్ని కీలక పత్రాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకొన్నట్లు వచ్చిన వార్తలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు.
అయన మీడియాతో మాట్లాడుతూ, “నగరంలో చాప క్రింద నీరులా ఉగ్రవాదం వ్యాపిస్తూనే ఉంది. ముఖ్యంగా మజ్లీస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పాతబస్తీలోనే ఇది ఎక్కువగా ఉందని పలుమార్లు నిరూపితమైంది. అక్కడకు ఇతర దేశాలకు చెందిన చొరబాటుదారులు ప్రవేశించి స్థిరపడుతున్నారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లోనే లభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో నగరం ఉగ్రవాదులకు రహస్య స్థావరంగా మారింది. అయితే తెరాసకు, మజ్లీస్ పార్టీ అధినేతల మద్య రాజకీయ స్నేహం కారణంగా ప్రభుత్వం వారి ఉనికిని గుర్తించడానికి కూడా ప్రయత్నించడం లేదు. నగరంలో ప్రజల భద్రతకు భరోసా కల్పించవలసిన పాలకులే తమ రాజకీయ అవసరాల కోసం ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటం సరికాదు. ఎన్.ఐ.ఏ. సోదాలు చేసిన ప్రతీసారి పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరులు, ఆయుధాలు లభిస్తునే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు...నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఉగ్రవాదం వ్యాపిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం తన అలసత్వం వీడటం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అసోం తరహాలో చర్యలు చేపట్టాలి,” అని అన్నారు.