
వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ నామల ఉమ (తెరాస)పై ఆమె పార్టీకే చెందిన కౌనసిలర్లు కాంగ్రెస్, భాజపా సభ్యులతో కలిసి నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె భర్త లక్ష్మిరాజ్యంకు ఏ అధికారం లేకపోయినప్పటికీ చైర్ పర్సన్ భర్తనంటూ అధికారిక కార్యక్రమాలలో పెత్తనం చెలాయిస్తున్నారని, నామల దంపతులిద్దరూ అవినీతికి పాల్పడుతున్నారని కౌన్సిలర్ల ఆరోపణ.
వేములవాడ పురపాలక సంఘంలో మొత్తం 20మంది సభ్యులు ఉండగా తెరాస-5, కాంగ్రెస్-5, భాజపా-9, ఒక స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారు. వారిలో మూడు పార్టీలకు చెందిన 15మంది కౌన్సిలర్లు ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసును జూలై 9న డి.ఆర్.ఓ. శ్యాంప్రసాద్ కు అందజేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు ఈరోజు (ఆగస్ట్ 7) బోర్డు సభ్యులను సమావేశపరిచి నామల ఉమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. భాజపా దీని కోసం తన కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. మొత్తం 20మందిలో 15మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్నారు కనుక ఆఖరు నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె దీనిలో నెగ్గడం కష్టమే.
ఆమె దీనిలో గెలుస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే, ఈ అవిశ్వాస తీర్మానంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గం పరిధిలో తెరాస నేతల మద్య నెలకొని ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండటం ఏ పార్టీకైనా ఆందోళనకరమే.