ఆ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ (ఎన్.సి.బి.సి) బిల్లుకు సోమవారం రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ బిల్లుకు మోక్షం లభించింది. వాస్తవానికి 1993లోనే ఎన్.సి.బి.సి. ఏర్పాటు చేయబడింది కానీ దానికి పరిమితమైన అధికారాలు కల్పించడం చేత అది ఏ కులాలను ఓబిసి జాబితాలో చేర్చాలో వేటిని తొలగించాలో కేంద్రప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికే పరిమితంకావలసి వచ్చింది. కానీ ఎన్.సి.బి.సిని బలోపేతం చేయడానికి నిర్దేశించిన సవరణల బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో దానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఇకపై అది స్వతంత్రంగా ఓబిసి వర్గాల పిర్యాదులను స్వయంగా పరిష్కరించగలదు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ పరిధిలో ఉన్న ఓబిసి వర్గాల హక్కులను కాపాడగలదు. అదేవిధంగా ఓబిసి వర్గం హక్కులకు భంగం కలిగే కేంద్రప్రభుత్వం చర్యలను అడ్డుకోగలదు. రెండున్నర దశాబ్దాలుగా ఒక డమ్మీ వ్యవస్థగా నడుస్తున్న ఎన్.సి.బి.సి ఇకపై సాధికారంగా పనిచేయగలదు.