తెలంగాణాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు




తెరాస ఎంపి బిబి పటేల్ లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానంగా ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 19, 932.49 కోట్లు విలువగల 14 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు: 

1. మంచిర్యాల-పెద్దపేట ట్రిపులింగ్ పనులు వచ్చే నెల(సెప్టెంబరు)లో పూర్తవుతాయి.

2. మునీరాబాద్-మహబూబ్ నగర్ రైల్వే లైన్ నిర్మించబోతున్నట్లు 1997-98 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. ఈ రైల్వే లైన్ పొడవు 246 కిమీ. కానీ 20 ఏళ్ళలో కేవలం 71.55 కిమీ మాత్రమే నిర్మాణం పూర్తయింది. మిగిలిన 173.6 కిమీ రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.275 కోట్లు కేటాయించింది. దీనికి అవసరమైన నిధులు కేటాయించబడ్డాయి కనుక త్వరలోనే భూసేకరణ కార్యక్రమం పూర్తి చేసి మిగిలిన రైల్వే లైన్ నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది.

3. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతోంది.

4. భద్రాచలం-కొవ్వూరు మార్గంలో తెలంగాణా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అలైన్మెంట్ మార్చబడింది. దాని ప్రకారం తెలంగాణా భూభాగంలో 45.48కిమీ ఏపిలో 70.3కిమీ రైల్వే లైన్ నిర్మించబడుతుంది. తెలంగాణాలో నిర్మించబోయే రైల్వే లైన్ కు రూ.2,735.70 కోట్లు, ఏపిలో రైల్వే లైనుకు రూ. 1,419.13 కోట్లు ఖర్చు అవుతుంది. దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  50:50 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి.  

5. ఏపి, గుంటూరు జిల్లాలోని మాచర్ల-నల్గొండకు మద్య రైల్వే లైన్ నిర్మాణం లాభదాయకం కాదు కనుక ఆ ప్రతిపాదనను పక్కన పెట్టబడింది.

6. మణుగూరు-రామగుండం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని, 50 శాతం పెట్టుబడిని అందించినట్లయితే వెంటనే పనులు మొదలుపెడతామని పీయూష్ గోయల్ తన లేఖలో తెలిపారు.

7. కొండపల్లి-కొత్తగూడెం-పెనుబల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు తమ వంతు పెట్టుబడిని పెట్టాల్సి ఉందని తెలిపారు. ఏపి ప్రభుత్వం తన 13శాతం వాటా చెల్లించడానికి సముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. 

8. విజయవాడ-గుంటూరు వయా అమరావతి మార్గంలో 6 కిమీ తెలంగాణా భూభాగంలోకి వస్తుందని తెలిపారు. రూ.1732.56 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ఎర్రుపాలెం-నంబూరు మద్య 56.53కిమీ పొడవున సింగిల్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.