కాళేశ్వరం ప్రధాన సబ్-స్టేషన్ రెడీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ(కన్నెపల్లి), అన్నారం, సుందిళ్ళ వద్ద ఏర్పాటుచేస్తున్న పంప్ హౌసులకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి గోలివాడ గ్రామ శివారులో 400/220/11 కేవీ సామర్ధ్యం గల విద్యుత్‌ సబ్-స్టేషన్ నిర్మాణం పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న 19 విద్యుత్‌ సబ్-స్టేషన్లలో ఇదే అతి పెద్దది. ప్రధానమైనది. గత ఏడాది అక్టోబర్ నెలలో దీని నిర్మాణం మొదలు పెట్టి 18 నెలలలోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. కానీ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల సిబ్బంది రేయింబవళ్ళు పనిచేసి కేవలం 10 నెలలోనే సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. ట్రాన్స్ కో (ఎత్తిపోతల పధకం) డైరెక్టర్ సూర్య ప్రకాష్ ఈ సబ్ స్టేషనును జూలై 18వ తేదీన కమీషనింగ్ కూడా చేశారు. 

ఈ సబ్- స్టేషన్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా ఎన్.టి.పి.సి. లేదా జాతీయ గ్రిడ్ నుంచి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అవుతుంటుంది. కానీ దీనికి మాత్రం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ వద్ద గల సింగరేణి ధర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది.  

దీని ద్వారా గోలివాడ పంప్ హౌస్ లో 40మెగావాట్లు సామర్ధ్యం ఉన్న 9 మోటర్లకు, అన్నారంవద్ద ఏర్పాటు చేసిన 40 మెగావాట్లు సామర్ధ్యం ఉన్న 8 మోటర్లకు, మేడిగడ్డ (కన్నేపల్లి)లోని 40మెగావాట్లు సామర్ధ్యం ఉన్న 11 మోటర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఆగస్ట్ నెలాఖరు నుంచి ఈ మూడు పంప్ హౌసులలో అన్ని మోటార్ పంపుల ట్రయల్ రన్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.