తెలంగాణా జోనల్ వ్యవస్థకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించాలని సిఎం కేసీఆర్‌ చేసిన అభ్యర్ధనపై ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారు. ఈ వారంలోనే రాష్ట్రపతి చేత సంతకం చేయించి దానికి ఆమోదముద్ర వేయబోతున్నట్లు కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వానికి  సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై న్యాయవివాదాలకు తావుండదు కనుక నియామకాలు జోరందుకోవచ్చు. 

సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పాతజోన్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు కొత్త జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. దీనిలో రాష్ట్ర క్యాడర్ విధానం తొలగించబడింది. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే 95 శాతం ప్రభుత్వోద్యోగాలు స్థానిక యువతకే లభిస్తాయి. ఆగస్ట్ 10 లోగా రాష్ట్రపతి దీనికి ఆమోదముద్ర వేస్తే, కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీకి ఆగస్ట్ 15వ తేదీన నోటిఫికేషన్స్ జారీ చేయడానికి టి.ఎస్.పి.ఎస్.సి. సిద్దం అవుతున్నట్లు సమాచారం. వాటిలో మొట్టమొదట సుమారు 9,000 పంచాయితీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.