కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తెరాస నేతలు శనివారం బారీ బహిరంగసభ నిర్వహించి ఆయనకు సవాలు విసిరారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కుస్గీలో ఈరోజు తెరాస నిర్వహించిన బహిరంగసభలో మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈసారి కొడంగల్ నియోజకవర్గంలో తెరాసయే గెలుస్తుంది. దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ నేతలు మాటలకే పరిమితమైతే మా ప్రభుత్వం చేతలలో చూపిస్తోంది. ఒకప్పుడు కరెంటు సమస్యల గురించి రోజూ మాట్లాడుకొనేవారిమి. ఇప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ కరెంటు పోదు కనుక. ఇదివరకు ఎరువులు, విత్తనాల కోసం కొట్లాడుకోవలసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు లేదు. ఇదివరకు నీటికి కటకటలాడేవాళ్ళం ఇప్పుడు లేదు. మరో 15 రోజులలో మిషన్ భగీరథ ద్వారా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ మంచి నీళ్ళు అందుతాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా కోడంగల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు పారిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏడు దశాబ్దాలలో చేయలేని పనులన్నిటినీ మేము కేవలం నాలుగేళ్ళలో చేసి చూపిస్తున్నాము. కనుక కొడంగల్ తో సహా జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చే ఎన్నికలలో తెరాసకే ఓటేసి గెలిపించడం ఖాయం. అభివృద్ధి సంక్షేమం కావాలనుకోనేవారందరూ తెరాసకు తప్పకుండా ఓటేస్తారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం,” అని అన్నారు.
తెరాస బహిరంగ సభను నిరసిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో రేవంత్ రెడ్డి పేరు వ్రాసున్న పెద్దపెద్ద జెండాలను పట్టుకొని అయన అనుచరులు నిరసనలు తెలిపారు. నిరసన ర్యాలీలు చేయడానికి కూడా ప్రయత్నించారు కానీ పోలీసులు వారిని అడ్డుకొన్నారు. కాంగ్రెస్-తెరాస కార్యకర్తలు ఒకే చోటకు చేరడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు బారీగా పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపుతప్పకుండా ఉంది. ఈ సభపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇది తనపై దండయాత్రగానే భావిస్తున్నానని అన్నారు.