నా ఆరోపణలకు సమాధానం అది కాదు

తెలంగాణాలో నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులలో బారీగా అవినీతి జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. అయితే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తమపై ఎదురుదాడి చేస్తూ తాము చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకొంటున్నారని కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస నేతలు గుత్తేదారుల నుంచి కమీషన్లు పిండుకొంటూ మళ్ళీ వారిని కాంగ్రెస్‌ నేతలు బెదిరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించడం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస సర్కారును వెనకేసుకు వస్తూ మాట్లాడే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన స్వంత అక్కగారినే మోసం చేసిన ఘనుడని అటువంటి వ్యక్తి నన్ను విమర్శిస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస సర్కార్ తనపై ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి అన్నారు.