
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటన ఖరారు అయ్యింది. ఆగస్ట్ 13,14 తేదీలలో అయన నగరంలో పర్యటించబోతున్నారు. ఆగస్ట్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ గాంధీ విమానాశ్రయంలో దిగుతారు. మరుసటి రోజు సాయంత్రం 7.30గంటల వరకు వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశమవుతారు. మొదటిరోజు సాయంత్రం 5 గంటలకు శేరిలింగంపల్లిలో, మళ్ళీ రాత్రి 8గంటలకు నాంపల్లిలో వరుసగా రెండు బహిరంగ సభలలో పాల్గొంటారు.
మరుసటి రోజు అంటే ఆగస్ట్ 14న సాయంత్రం 3.30 గంటలకు సికింద్రాబాద్లో, 5గంటలకు సనత్ నగర్లో బహిరంగ సభలలో పాల్గొంటారు.
ఈ రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ పార్టీ నేతలతో పాటు, ముస్లిం నేతలు, మేధావులు, మీడియా ప్రముఖులు, ఊస్మానియా విద్యార్ధులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశాలలో పాల్గొంటారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన ఇంత టైట్ గా రూపొందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పర్యటనలో అయన ప్రధానంగా జంటనగరాలలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించబోతున్నట్లు స్పష్టమవుతోంది. వాటి కంటే ఆసక్తి కరమైన అంశాలు ఏమిటంటే, ఆగస్ట్ 14న మధ్యాహ్నం సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో, రాత్రి పాతబస్తీలో మదీనా హోటల్లో భోజనం చేయడం. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్ధులను కలువబోతున్నారు. తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను తెలంగాణా ప్రభుత్వం దూరం చేసుకొని చాలా కాలమే అయ్యింది. కనుక యూనివర్సిటీలో తెరాస నేతలు ఎవరూ అడుగుపెట్టడం లేదు. కనుక రాహుల్ గాంధీ పర్యటనతో ఉస్మానియా విద్యార్ధులు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవవచ్చు.
ఆగస్ట్ 14న రాత్రి 9.30 గంటలకు మదీనా హోటల్లో భోజనం చేసిన తరువాత 10.30 గంటలకు విమానంలో మళ్ళీ డిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.