
తెరాస ఎంపి డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను త్రోసిపుచ్చారు. నిజామాబాద్లో అయన మీడియాతో మాట్లాడుతూ, “నేను అటువంటి వ్యక్తిని కానని అందరికీ తెలుసు. నాకు శాంఖరి నర్సింగ్ కాలేజీతో ఎటువంటి సంబంధమూ లేదు. దానిని నేను చాలా కాలం క్రితమే వేరేవారికి ఇచ్చేశాను. ఇప్పుడు నేను ఆ కళాశాలకు వెళ్ళడం లేదు. నాపై కొందరు రాజకీయకుట్రకు పాల్పడుతున్నారు. నన్ను అప్రదిష్టపాలు చేయడానికి వారే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారు,” అని అన్నారు.
అయితే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఆ ఆడపిల్లలు సాధారణంగా ఇటువంటి సమస్యలను పంటిబిగువున భరిస్తుంటారు. కానీ ఇక ఏమాత్రం భరించలేని స్థితి వచ్చి వేరే మార్గం కనబడనందునే ఇంత దూరం వెళ్తారు. కనుఅక్ వారి ఆరోపణలను తేలికగా కొట్టి పడేయలేము. కనుక ఈ కేసులో నిజానిజాలు పోలీసుల విచారణలోనే బయటపడతాయి. కానీ అధికార పార్టీకి చెందిన సంజయ్ ను పోలీసులు విచారించగలరో లేదో చూడాలి.
ఎంపి డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేకకార్యక్రమాలకు పాల్పడుతున్నారు కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని తెరాస ఎంపి కవితతో సహా జిల్లాలోని తెరాస నేతలు సిఎం కేసీఆర్కు పిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ సంజయ్ వ్యవహారం కూడా రచ్చకెక్కడంతో డి.శ్రీనివాస్ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనుక వారి వలన పార్టీకి అప్రదిష్ట కలిగే ప్రమాదం ఉంది కనుక తండ్రీకొడుకులిద్దరిపై వేటు పడుతుందేమో?