కేసీఆర్‌ తెలంగాణా గాంధీవంటివారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణా గాంధీ వంటివారని తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అయ్యింది. కానీ ఇంతవరకు దేశాన్ని పాలించిన పాలకులు ఎవరూ మారుమూల గ్రామాలలో నివసిస్తున్న బడుగు, బలహీన, దళిత ప్రజలను పట్టించుకోలేదు. అన్ని పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు. కానీ సిఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళకే వారికోసం కొత్త పంచాయితీలు ఏర్పాటు చేసి, వారికీ అధికారం, పాలనలో భాగస్వామ్యం కల్పించారు. వారికీ తమ ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని తద్వారా తమ జీవితాలలో వెలుగులు నింపుకొనే అవకాశం కల్పించారు. కనుక దేశానికి ఏడు దశాబ్దాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటికీ పల్లెల్లో జీవిస్తున్న బడుగు, బలహీన, దళిత ప్రజలకు ఈ ఆగస్ట్ 2వ తేదీ నుంచే స్వాతంత్రం వచ్చిందని భావిస్తాము. గ్రామస్వరాజ్యం రావాలని మహాత్మాగాంధీజీ కలలు కానివారు. గ్రామాలు బాగుపడితేనే దేశమూ బాగుపడుతుందని చెప్పేవారు. అయన మాటలను సిఎం కేసీఆర్‌ ఆచరణలో చూపారు. కనుక కేసీఆర్‌ను తెలంగాణా గాంధీ అని అనవచ్చు,” అని రాములు నాయక్ అన్నారు.