
సిఎం కెసిఆర్ నేడు డిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ వ్యవస్థ గురించి ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా వివరించి దానికి ఆమోదముద్ర వేయించుకొనేందుకు డిల్లీ వెళుతున్నారు. అవసరమైతే దీని కోసం డిల్లీలోనే రెండు మూడు రోజులు ఉండాలని భావిస్తునట్లు సమాచారం.
సిఎం కెసిఆర్ ఇదే పని మీద మే 27వ తేదీన ఒకసారి ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు డిల్లీ వెళ్ళారు. కానీ అప్పుడు ప్రధాని విదేశీయాత్రలకు బయలుదేరుతుండటంతో అపాయింట్మెంట్ లభించలేదు. కానీ అప్పుడు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ ను కలిసి రాష్ట్రంలో అమలుచేయలనుకొంటున్న కొత్త జోనల్ వ్యవస్థ గురించి వివరించారు. దానికి హోం, న్యాయశాఖలు ఆమోదం తెలిపి ఆ ఫైలును ప్రధాని నరేంద్రమోడీ వద్దకు పంపినట్లు తెలుస్తోంది. కనుక దీని గురించి నేరుగా ప్రధాని మోడీతోనే మాట్లాడి ఒప్పించేందుకు కేసీఆర్ డిల్లీ బయలుదేరుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో ఏర్పాటయిన పాత జోన్ల స్థానంలో తెలంగాణా ప్రభుత్వం ఏడు కొత్త జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయి. మిగిలిన 5శాతం ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.