విద్యార్ధినులపై డి.శ్రీనివాస్ కొడుకు లైంగిక వేధింపులు!

తెరాస ఎంపి డి.శ్రీనివాస్ కొడుకు డి.సంజయ్ పై మహిళా సంఘాల నేత సంధ్య రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డికి గురువారం పిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో శాంఖరి నర్సింగ్ కాలేజీ యజమాని అయిన సంజయ్ తన కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సంధ్య హోంమంత్రికి పిర్యాదు చేశారు. ఆమెతో పాటు ఆ కాలేజీలో చదువుకొంటున్న కొంతమంది విద్యార్ధినులు కూడా హోంమంత్రికి తమ బాధలు చెప్పుకొని సంజయ్ పై చర్యలు తీసుకోవలసిందిగ లిఖిత పూర్వకంగా పిర్యాదు అందజేశారు. హోంమంత్రి వెంటనే డిజిపి మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి సంజయ్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించారు. 

అనంతరం మహిళా సంఘాల నేత సంధ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “బిఎస్సి నర్సింగ్ కోర్సు చేయడానికి వచ్చే వారిలో దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లలే ఎక్కువగా ఉంటారు. ఈ కోర్సు చేస్తే త్వరగా ఉద్యోగం సంపాదించుకోవచ్చను కొంటారు. కానీ శాంఖరి నర్సింగ్ కాలేజీలో చేరిన 11 మంది ఆడపిల్లలను సంజయ్ లైంగిక వేధిస్తుండటంతో వారు తమ బాధలను పైకి చెప్పుకోలేక, అతని వేధింపులు భరించలేక లోలోన కుమిలిపోతున్నారు. అతను ఆడపిల్లలను కాలేజీలో తన గదికి పిలిపించుకొని వారి అంగాంగాలను వర్ణిస్తూ నీచంగా మాట్లాడుతుంటాడు. వాళ్ళను శారీరికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. చివరికి వారు నివసిస్తున్న హాస్టల్లోకి కూడా వెళ్లి వేధింపులకు పాల్పడుతుండటంతో ఆ విద్యార్ధినులు బయట ప్రైవేట్ హాస్టల్ కు మారారు. కానీ అతను అక్కడికి కూడా వెళ్లి వేధిస్తుండటంతో ఆ విద్యార్ధినులు తమ తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళిపోయారు. కానీ చదువులు ఆగిపోతే తమకే నష్టమని వారు మళ్ళీ హాస్టల్ కు తిరిగి వస్తే సంజయ్ మళ్ళీ వారిని వేధించడం మొదలుపెట్టాడు. జూలై 26వ తేదీన వారిలో ఇద్దరు విద్యార్ధినులను సంజయ్ తను ఉంచుకొన్న ఒక మహిళ ఇంటికి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం చేయబోయాడు. కానీ సమయానికి ఆ మహిళ ఇంటికి తిరిగి రావడంతో ఆ ఇద్దరు విద్యార్ధినులు క్షేమంగా బయటపడగలిగారు. సంజయ్ ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటువంటి కామాంధుడి చేతిలో ఏ ఆడపిల్ల జీవితం నాశనం కాకమునుపే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింసింహారెడ్డిని కలిసి పిర్యాదు చేశాము,” అని సంధ్య చెప్పారు.