
సిర్పూజ్ పేపర్ మిల్లును పునఃప్రారంభించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ గురువారం మిల్లులో పూజలు నిర్వహించారు. తీవ్ర నష్టాలలో కూరుకుపోయి నాలుగేళ్ళ క్రితం మూతపడిన ఈ మిల్లును తెరిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చాలా కృషి చేశారు. కనుక ఆయన కూడా ఈ పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మిల్లు కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మిల్లు మూతపడినప్పటి నుంచి మీరు పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్ళీ ఈ మిల్లును తెరిపించేందుకు చాలా కృషి చేశారు. ఆయన పట్టుధలతోనే ఇది సాధ్యమైంది కనుక ముందుగా మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ మిల్లుపై ఆధారపడి సుమారు 10,000 కుటుంబాలు జీవిస్తున్నందున, వారి సమస్యలను అర్ధం చేసుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కష్టమైనా ఈ మిల్లును పునఃప్రారంభించాలని ఆదేశించడంతో మేము జెకె పేపర్ మిల్స్ యాజమాన్యాన్ని ఒప్పించి మళ్ళీ ఈ మిల్లును తెరిపిస్తున్నాము. కనుక ఇక నుంచి ఈ మిల్లును కాపాడుకోవలసిన బాధ్యత మీదే. కొందరు స్వార్ధపరులైన నాయకుల మాటలు నమ్మి మళ్ళీ సమ్మెలు అవి చేస్తే మీరే నష్టపోతారని గుర్తుంచుకోండి. మిల్లు రిపేర్లు పూర్తి చేసుకొని ఈ డిసెంబర్ నాటికల్లా ఉత్పత్తి ప్రారంభిస్తుంది,” అని చెప్పారు.