జనసేనలోకి మోత్కుపల్లి?

తెదేపా బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌తో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. మోత్కుపల్లి స్వయంగా పవన్ కల్యాణ్‌‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఈరోజు మధ్యాహ్నం తన నివాసానికి రావలసిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. 

మోత్కుపల్లి తెదేపా నుంచి బహిష్కరించబడిన తరువాత ఏ పార్టీలోను చేరలేదు. తెలంగాణాలో జనసేనకు బలమైన నాయకుడు ఎవరూ లేరు. వచ్చే ఎన్నికలలో జనసేన రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్‌‌ ప్రకటించారు కనుక తెలంగాణాలో అందరికీ సుపరిచితుడైన మోత్కుపల్లి నరసింహులు వంటి నేత అవసరం చాలా ఉంది. కనుక మోత్కుపల్లికి తెలంగాణా జనసేన భాద్యతలు అప్పగించేమాటయితే ఆయన పార్టీలో చేరవచ్చు. 

ఇక వచ్చే ఎన్నికలలో ఏపిలో తెదేపా, వైకాపాలతో జనసేన పోటీ పడవలసి ఉంటుంది కనుక మోత్కుపల్లి సేవలు, సలహాలు, సూచనలు పవన్ కల్యాణ్‌‌కు చాలా ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గుట్టు తెలిసిన మోత్కుపల్లి వంటి నేతపక్కన ఉంటే ఎదుర్కోవడం సులువు అవుతుంది. కనుక మోత్కుపల్లి జనసేన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపటిలో వారు సమావేశమయిన తరువాత దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూద్దాం.