డబ్బు కట్టలతో ఉత్తమ్ దొరికిపోలేదా? కేటీఆర్

కాంగ్రెస్‌ నేతలు తనపై, తెరాస సర్కార్ పై చేస్తున్న ఆరోపణలకు మంత్రి కేటీఆర్ నిన్న నిజామాబాద్‌లో గట్టిగా బదులిచ్చారు. “ఎన్నికలు దగ్గర పడుతున్నందున కాంగ్రెస్‌ నేతలు మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్లకట్టలతో దొరికిపోలేదా?          పాతాళం నుంచి ఆకాశంలో ఎగిరే యుద్దవిమానాల వరకు ప్రతీ దానిలో అవినీతికి పాల్పడింది మీ ప్రభుత్వం కాదా? ప్రపంచంలో అందరికంటే ధనికుడు మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే మీరు అంగీకరిస్తారా? ఇటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడే గుణం మాకు లేదు. అది కాంగ్రెస్ పార్టీకే స్వంతం. 

ఎన్నికలు జరిగేవరకు ఇక నుంచి రాహుల్ గాంధీ ప్రతీనెలా తెలంగాణాలో పర్యటిస్తారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నారు. మంచిదే. కానీ ఆయన స్వంత నియోజకవర్గమైన అమేధీ మున్సిపల్ ఎన్నికలలోనే కాంగ్రెస్‌ను గెలిపించుకోలేకపోయారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా గెలిపించుకొంటారు? 

తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు వారి డిల్లీ పెద్దలకీ, ఇక్కడ ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకి బానిసలు. వారు స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేరు. అటువంటివారిని గెలిపిస్తే తెలంగాణా రాష్ట్ర పాలన అటు డిల్లీ, ఇటు అమరావతి నుంచే సాగుతుంది తప్ప హైదరాబాద్‌లో నుంచి కాదు. 

కాంగ్రెస్‌ పార్టీని ప్రసన్నం చేసుకొనేందుకే చంద్రబాబు నాయుడు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు తప్ప ఏపి ప్రయోజనాలు నెరవేరనందుకు కాదు. తెదేపాతో పొత్తుల కోసం అర్రులు  చాస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కోర్టులలో పిటిషన్లు వేయిస్తున్నారు. వారికి ఎన్నికలలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.