పోలవరంపై తెలంగాణా ప్రభుత్వం పిటిషన్

రాష్ట్రవిభాజనకు ముందు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడిన ఏపిలోని పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేసింది. సుమారు 50 లక్షల క్యూసెక్కుల నీటి నిలువ సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వలన భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు సింగరేణికి చెందిన అనేక బొగ్గు గనులు కూడా ముంపుకు గురవుతాయని పిటిషనులో పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఓడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేసింది. తమ పిటిషనును కూడా దానితో కలిపి విచారించవలసిందిగా తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధనను సుప్రీంకోర్టు మన్నించింది.  ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. తెలంగాణా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ ఈ కేసును వాదించనున్నారు.

ఇది జాతీయ ప్రాజెక్టు కనుక ఈ కేసును ఎదుర్కోవలసిన బాధ్యత ఏపి ప్రభుత్వానికి కంటే కేంద్రానికే ఎక్కువ ఉంటుంది.       ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఉన్నందున, ఇప్పటికే ఆ ప్రాజెక్టు నిర్మాణంపై వేలకోట్లు ఖర్చు చేసి ఉన్నందున దీనిపై సుప్రీంకోర్టు ఏవిధంగా తీర్పు చెపుతుందో చూడాలి.