సింగరేణిలో కారుణ్య నియామకాలు షురూ

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల ప్రక్రియ మొదలైంది. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ వైద్యులత్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు గత నాలుగు నెలలలో పదిసార్లు సమావేశమయ్యి మొత్తం 1,921 మంది కార్మికులను పరిశీలించి వారిలో 1,344 మంది ‘మెడికల్ అన్-ఫిట్’ సర్టిఫికేట్లు మంజూరు చేయడంతో వారి వారసులకు ఆ ఉద్యోగాలు లభించబోతున్నాయి. మిగిలిన 227మందిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారిలో కూడా చాలా మంది మెడికల్ అన్-ఫిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మెడికల్ బోర్డు సభ్యులు ఇచ్చిన మెడికల్ అన్-ఫిట్ దృవీకరణపత్రాల ఆధారంగా సదరు కార్మికుల వారసులకు వెంటనే నియామకపత్రాలు అందజేయడం మొదలుపెట్టామని సింగరేణి ఎండి శ్రీధర్ చెప్పారు. రామగుండం-1 ఏరియాలో బుధవారం 40 మంది కార్మికుల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. రామగుండం-1 ఏరియాలో ఇంకా మిగిలిన కార్మికులకు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలలో మెడికల్ అన్-ఫిట్ పొందిన కార్మికుల వారసులకు కూడా ఈ నెలలోనే ఉద్యోగ నియామకపత్రాలు అందజేస్తాము. కార్మికులు తమ విధులు నిర్వహించలేని అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే మెడికల్ బోర్డు సభ్యులే వారిని పరిశీలించి మెడికల్ అన్-ఫిట్ సర్టిఫికేట్లు అందజేశారు. కనుక దళారులను ఆశ్రయించవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని చెప్పారు.