
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో రూ.25కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఐటీ హబ్‌కు రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్ బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కవిత అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో హైదరాబాద్‌లో, వరంగల్ తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా నిజామాబాద్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా కలిగిస్తోంది. ఇది ప్రారంభం అయితే జిల్లా యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు పోనవసరం లేదు. ఇక ముందు కూడా ఏవైనా కొత్త ప్రాజెక్టులు తలపెడితే ముందుగా మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా మంత్రి కేటీఆర్ ను కోరుతున్నాను. నిజామాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటుకు కూడా రామన్న (కేటీఆర్) ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టణంలో ఉన్న ఆర్టీసి బస్టాండ్ చాలా చిన్నదిగా ఉండటం వలన ప్రజలకు అసౌకర్యంగా ఉంది. బస్టాండ్ ఉన్న స్థలాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి ఇచ్చేసి వేరే ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన కొత్త బస్టాండ్ నిర్మించడానికి రూ.25 కోట్లు మంజూరు చేయవలసిందిగా రామన్నను కోరుతున్నాను. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభకు వచ్చిన యువత, విద్యార్ధులు అందరూ తెలుసుకొని మీ తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా వివరించాలని కోరుతున్నాను. అదేవిధంగా అందరూఒక్కో మొక్క నాటి వాటితో ఫోటోలు తీయించుకొని ట్విట్టర్ లో నాకు, రామన్నకు పంపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.