మాకు స్థలం కేటాయించండి: తెదేపా

రాష్ట్రంలో గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలు పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక ఎకరం చొప్పున ఒక్కో పార్టీకి 29 ఎకరాల స్థలం గజం రూ.100 చొప్పున కేటాయించాలని ఇటీవల మంత్రివర్గం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను, పధకాలను నిత్యం విమర్శించే తెదేపా అన్ని పార్టీల కంటే ముందుగా దీనిపై స్పందించింది. అంటే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిందని కాదు. తమ పార్టీకి జిల్లా కేంద్రంలో ఎకరం భూమి ఇవ్వాలని అభ్యర్ధించింది. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.ఆనంద్ నేతృత్వంలో తెదేపా నేతలు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌ను కలిసి తమ పార్టీ కార్యాలయం నిర్మించుకొనేందుకు జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం కేటాయించవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. 

అనంతరం ఆనంద్ విలేఖరులతో మాట్లాడుతూ, “మా పార్టీ రాష్ట్ర విభజనకు ముందు 17 ఏళ్ళపాటు అధికారంలో ఉంది. విభజన తరువాత గత నాలుగేళ్ళుగా ప్రజా సమస్యలపై పోరాడుతోంది. మాది జాతీయస్థాయిలో గుర్తింపు కలిగిన పార్టీ. కనుక మా పార్టీ కార్యాలయం నిర్మించుకొనేందుకు స్థలం కేటాయించవలసిందిగా కలెక్టరును కోరాము,” అని చెప్పారు. 

రాష్ట్ర విభజన తరువాత కూడా తెదేపా చాలా బలంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏదోవిధంగా తన ఉనికిని చాటుకోవలసిన దుస్థితికి దిగజారడం అందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తరువాత రాష్ట్రంలో తెదేపా గొంతు వినబడకుండాపోయింది. వచ్చే ఎన్నికల తరువాత ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కానీ జిల్లా కేంద్రంలో లక్షలు పలికే ఎకరం స్థలం కారుచావుకగా వస్తుంటే ఎవరు మాత్రం వదులుకొంటారు? తెదేపా నేతలు ఆత్రుత అర్ధం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం నుంచి దీనిపై జిల్లా కేంద్రాలకు ఇంకా ఉత్తర్వులు రాకమునుపే భూమి కేటాయించాలని తెదేపా నేతలు వినతిపత్రం సమర్పించడమే విచిత్రంగా ఉంది. 

జిల్లా కేంద్రాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కలిపి ఒకే సమీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లుగానే, అన్ని పార్టీలకు కలిపి ఒకే పెద్ద భవనంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రజాధనం మిగిలేది లేదా మార్కెట్ ధరలకే భూమిని విక్రయిస్తే బాగుండేది. ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ తప్పు పట్టే ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై మాత్రం పెదవి విప్పడం లేదు. పైగా భూమి కేటాయించాలని అప్పుడే వినతిపత్రాలు అందిస్తున్నాయి.