
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అధినేత ఎం.కరుణానిధి (94) ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి ఆసుపత్రి వద్దకు వేలాదిమంది డిఎంకె కార్యకర్తలు చేరుకొని కరుణానిధి కోసం గుండెలు బాదుకొంటూ విలపిస్తున్నారు. అయన కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమోలి, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉంటూ ప్రజలకు ధైర్యం చెపుతున్నారు. తమ తండ్రిని పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు.
తమిళనాట రాజకీయాలలో తనదైన ముద్రవేసిన గొప్ప రాజకీయ నాయకుడు కరుణానిధి. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ అయనను పరామర్శించదానికి తరలి వస్తున్నారు. అయితే 94 ఏళ్ళ వయసులో ఎంత గొప్పవారికైనా ఇటువంటి అనారోగ్య సమస్యలు తప్పవని అందరికీ తెలుసు. కానీ కరుణానిధి ఆరోగ్యపరిస్థితి విషమించినట్లు వార్తలు రాగానే డిఎంకె నేతలు, కార్యకర్తలు చేస్తున్న హడావుడి కాస్త అతిగానే ఉంది. తమిళనాట రాజకీయ పార్టీలు ఏ అంశంపైనైనా ఇదేవిధంగా కాస్త అతిగా ప్రవర్తిస్తుంటాయి. అయితే అవి పైకి చెప్పే కారణం ఒకటైతే లోన ఉద్దేశ్యం వేరే ఉండటం కూడా సహజమే. కనుక డిఎంకె చేస్తున్న ఈ హడావుడి కరుణానిధి ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోందనా లేక అయన పరిస్థితిపై ఆందోళన చేస్తూ ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.