గజ్వేల్‌లో నేడు హరితహారం ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

నేడు సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్‌ పట్టణంలో రెండు చోట్ల, ములుగు వద్ద జాతీయ రహదారి పక్కన ఒక చోట ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మొక్కలు నాటి 4వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీనిలో భాగంగా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న ప్రజలు ఒకేసారి లక్ష మొక్కలు నాటబోతున్నారు. దీనికోసం అధికారులు వేప, చింత, మునగ, కరివేపాకు, మామిడి, సపోటా వంటి మొక్కలతో సహా అనేక రకాల మొక్కలను పంపిణీ చేశారు. తద్వారా ప్రజలు తమకు నచ్చిన మొక్కలను ఇళ్ళలో, వీధుల్లో వేసుకొనేందుకు అవకాశం కల్పించారు. గజ్వేల్‌లో ఇళ్ళు, ఆసుపత్రులు,విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది.

దీని కోసం గజ్వేల్‌ను 8 డివిజన్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కో డివిజన్ లో కనీసం 15,000 మొక్కులు నాటే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రార్ధనా మందిరాలలో సైరన్లు మోగించడం ద్వారా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొక్కలు నాటుతున్న సమయంలోనే పట్టణంలో ప్రజలందరూ కూడా మొక్కలు నాటే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 4వ విడత హరితహారం కార్యక్రమం మొదలవుతుంది. ఆయా జిల్లాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత స్థానిక వ్యవసాయ కూలీలకు అప్పగించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కనుక ఇకపై నాటిన ప్రతీ మొక్క సరక్షించబడుతుంది కనుక రాష్ట్రంలో పచ్చదనం పెరిగే అవకాశం ఉంటుందని భావించవచ్చు.