
పంచాయితీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషనుపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కల్పించింది.
రాష్ట్రంలో అన్ని పంచాయితీల పదవీకాలం నేటితో ముగిసిపోతున్నందున, మళ్ళీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్లతో పంచాయితీ పాలన సాగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శంషాబాద్‌కు చెందిన జెడ్.పి.టి.సి సతీశ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పంచాయితీల పదవీకాలం ముగియక మునుపే ఎన్నికలు నిర్వహించవలసిన ప్రభుత్వమూ, ఎన్నికల సంఘమూ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తున్నాయని వాదించారు. కనుక తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.
ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వారి వాదనలపై స్పందిస్తూ, బిసి గణన, బిసి రిజర్వేషన్లు పూర్తయ్యేవరకు ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేశారు. గత నెల ఇదే కేసులో తాను ఇచ్చిన ఉత్తర్వులు నేటికీ అమలులోనే ఉన్నాయని వాటికి విరుద్ధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేనని స్పష్టం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకాలపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రస్తావిస్తూ పాలనా వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. అయితే ఈ కేసులో మూడు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి, ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.