అవిశ్వాసానికి థాంక్స్: ప్రధాని మోడీ

తెదేపా, కాంగ్రెస్‌ వాటి మిత్రపక్షాలు కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ మీడియాకు చెప్పారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వలననే అవి తమ ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలకు లోక్ సభలో ధీటుగా సమాధానం చెప్పుకొనే అవకాశం కలిగిందని అందుకే ప్రతిపక్షాలు కృతజ్ఞతలు తెలుపుకొన్నారని కేంద్రమంత్రి చెప్పారు. 

అయితే ప్రతిపక్షాల అవగాహనారాహిత్యానికి, అపరిపక్వతకు అవిశ్వాస తీర్మానం అద్దం పట్టిందని అన్నారు. ఎటువంటి కారణమూ లేకుండా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు లోక్ సభలో మరొకసారి భంగపడ్డాయని అనంత్‌ కుమార్‌ అన్నారు. 

అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిగినప్పుడు ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడిన తీరును రాజకీయ విశ్లేషకులు సైతం తప్పు పట్టారు. ఏపి ఎంపిలు ప్రత్యేకహోదా, రైల్వే జోన్ మొదలైన హామీల గురించి  అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పనే లేదు. ఏపి సమస్యల గురించి మాట్లాడకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విమర్శలతో సరిపెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఏపికి ఇచ్చిన హామీలను అమలుచేయనందుకేనని అందరికీ తెలుసు. కానీ మోడీ దానినీ ఒప్పుకోలేదు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాల అహంభావానికి నిదర్శనమని అన్నారు. కానీ సభలో అయన మాట్లాడిన తీరే అహంకారపూరితంగా కనిపించింది. 

ప్రస్తుతం మోడీ అధికారంలో ఉన్నారు కనుక అయన ఏమి చెప్పినా చెల్లుతుంది. కానీ రేపు ఎన్నికలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మోడీ సర్కార్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుస్తుంది. ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేసిందని తెలుగు ప్రజలు భావిస్తే రెండు రాష్ట్రాలలో భాజపాకు తప్పకుండా పట్టం కడతారు. లేకుంటే తిరస్కరిస్తారు.