
వచ్చే ఎన్నికలలో తెదేపాతో పొత్తులు పెట్టుకొబోతున్నామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే సర్వే సత్యనారాయణ విస్పష్టంగా నిన్న ప్రకటించారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత మాపార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఇక నుంచి ఎన్నికలు జరిగేవరకు నెలకు ఒకసారి తెలంగాణాలో పర్యటిస్తుంటారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో మేము ఆయనకు మా అభిప్రాయలు మాత్రమే చెపుతాము. దీనిపై ఆయనే తుది నిర్ణయం తీసుకొంటారు. ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం,” అని అన్నారు.
తెదేపాతో పొత్తులు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందని సర్వే సత్యనారాయణ మాటలతో స్పష్టం అయ్యింది. కానీ రాజకీయంగా తమ బద్ధశత్రువైన తెదేపాతో పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలో కొందరు సీనియర్ నేతలు అయిష్టంగా ఉన్నారు. పొత్తులపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది కనుక రాహుల్ గాంధీ పేరు మీద ఆ తంతు జరిపించాలని ఉత్తమ్ కుమార్ భావిస్తున్నట్లున్నారు. అందుకే దీనిపై అధికారిక ప్రకటన చేయలేదనుకోవచ్చు.
నిజానికి తెదేపా నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే లేదా ఇంకా ముందుగానే కాంగ్రెస్-తెదేపాల పొత్తులు ఖరారయి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు, మోత్కుపల్లి దానిని వ్యతిరేకించడం, తెదేపాను తెరాసలో విలీనం చేసేయాలని సూచించడం వంటి పరిణామాలను ఒకసారి గుర్తు తెచ్చుకొంటే, అప్పటికే కాంగ్రెస్-తెదేపాలలో ఈ పొత్తులు ఆలోచనలు మొదలైందని అర్ధమవుతోంది. కనుక కాంగ్రెస్ సీనియర్ నేతలు అభ్యంతరాలు చెప్పకపోతే తెదేపాతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.