కాళేశ్వరంపై కాంగ్రెస్‌ నేతలకు అభ్యంతరం దేనికి?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ భవిష్యత్ లో తెలంగాణాకు భారంగా మారబోతోందని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి హరీష్ రావు ధీటుగా స్పందించారు. తెరాస ఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ హయంలో రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయం, రైతుల కోసం చేసిందేమీ లేదు. ఇప్పుడు మేము ప్రాజెక్టులు కట్టి పంటలు పండించడానికి నీళ్ళు అందిస్తుంటే కాంగ్రెస్‌ నేతలకు అభ్యంతరం ఎందుకో అర్ధం కావడం లేదు. చనిపోయినవారి పేర్లతో కూడా కాంగ్రెస్‌ నేతలు కోర్టులలో కేసులు వేయిస్తూ ప్రాజెక్టులను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏపి సిఎం కెసిఆర్ చంద్రబాబు నాయుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రానికి పిర్యాదులు చేస్తూ అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తునారు. మరి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఆయనకు తేడా ఏముంది? టి-కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అయిపోయాయి. అందుకే ప్రాజెక్టుల విషయంలో నిరాధారమైన, తప్పుడు ఆరోపోణలు చేస్తూ మా ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తుంటారు. కాంగ్రెస్‌ నేతలు తమ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని మంత్రి హరీష్ రావు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, తెలంగాణా జనసమితి తదితర పార్టీలు వ్యక్తం చేసిన అనుమానాలపై నమస్తే తెలంగాణా పత్రికలో ‘శకున పక్షుల శంకలు’ పేరుతో పూర్తి వివరాలు ప్రచురించింది. దానిలో వారు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.