
దేశంలో ఏదో తెలియని అంటురోగం వ్యాపిస్తున్నట్లు పసిపిల్లలపై, అభంశుభం తెలియని బాలికలపై, మహిళలు చివరికి కాటికి కాళ్ళు చాచుకొని కూర్చొన్న వృద్దురాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోతుండటంతో, వాటిని నివారించేందుకు రూపొందించిన పాత చట్టాలకు మళ్ళీ సవరణలు చేసి శిక్షలు కటినతరం చేయకతప్పలేదు.
క్రిమినల్ లా బిల్లు-2018కి చేసిన సవరణలను పార్లమెంటు నిన్న మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై 12 ఏళ్ళ లోపు ఆడపిల్లలపై అత్యాచారం చేసినవారికి 20 ఏళ్ళ జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుంది. 16 ఏళ్ళలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం 10 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తున్నారు. దానిని 20 ఏళ్ళకు పెంచారు. అదే సామూహిక అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖాదు విధించబడుతుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఏడేళ్ళు కటిన కారాగార శిక్షను 10 ఏళ్ళకు పెంచారు. కేసు తీవ్రతను బట్టి న్యాయమూర్తి మరింత కటిన శిక్ష విధించవచ్చు.
చిన్నారులపై అత్యాచార కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబడతాయి. అవి రెండు నెలలోపుగా తీర్పు చెప్పాలి. ఒకవేళ దానిపై అప్పీలు చేసుకొన్నా ఆరు నెలలోగా తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఇకపై ముందస్తు బెయిల్ మంజూరు చేయబడదు.
అత్యాచారాలకు పాల్పడితే నిర్భయ కేసు క్రింద కటిన కారాగార శిక్షలు, మరణశిక్షలు విధించబడవచ్చని తెలిసి ఉన్నప్పటికీ దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పైగా ఇంకా పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటి? అంటే ఈ నేరానికి పాల్పడినా లంచాలు ఇచ్చో లేదా రాజకీయ ఒత్తిళ్ళతోనో తప్పించుకోగల అవకాశం ఉన్నందునే అని చెప్పవచ్చు. కనుక కొత్త చట్టంలో అటువంటి మార్గాలను కూడా మూసివేసేవిధంగా నిబంధనలు రూపొందించినప్పుడే చట్టాలు సమర్ధంగా అమలవుతాయి. కనుక ఇటువంటి కేసులలో దోషులను తప్పించడానికి సహాయపడేవారికి సైతం కటినమైన శిక్షలు విధించేవిధంగా నిబందనలు ఉన్నప్పుడే ఈ కొత్త చట్టం పనిచేస్తుంది. అప్పుడే దోషులకు శిక్షలు పడటం మొదలువుతుంది. అప్పుడే ఇటువంటి నేరాలు చేయాలంటే భయం పుడుతుంది.