
భూపాలపల్లిలో గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తామని నాలుగేళ్ళ క్రితం కేంద్రం చెప్పింది. అది మాట తప్పలేదు. నేటికీ అదేమాట చెపుతోంది. నాలుగేళ్ళయినా యూనివర్సిటీ నిర్మాణపనులు ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదంటే అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని కొత్తసాకు చెపుతోంది. అటవీశాఖ నుంచి అనుమతులు రాగానే నిర్మాణపనులు మొదలుపెడతామని ఈరోజు ప్రకటించింది. అయితే మరొక 6-7 నెలలలోపు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. కనుక ఆలోగా నిర్మాణపనులు మొదలుపెడితేనే ఆ తరువాత ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. లేకుంటే మళ్ళీ పరిశీలనలోనే పుణ్యకాలం పూర్తయిపోవచ్చు. కనుక ఎన్నికల గంట మోగేలోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు మొదలుపెట్టించగలిగితే రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ వచ్చేసినట్లే. ఇటువంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం, తెరాస ఎంపిలు చాలా పట్టుదలగా ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక యూనివర్సిటీని సాధిస్తారనే ఆశిద్దాం.