తెలంగాణా కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సంఘాల నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం కావడంతో వారు నేటి నుంచి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారి ప్రధాన డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించడం. దానిపై కార్మికనేతలతో చర్చించిన మంత్రి జగదీశ్ రెడ్డి, కోర్టు తీర్పుకు అనుగుణంగా క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కోర్టు తీర్పు త్వరగా వెలువడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి ఇతర డిమాండ్లను కూడా పరిశీలించి ఆచరణ సాధ్యమైనవాటిని అమలుచేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇవ్వడంతో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సంఘాల నేతలు సమ్మె విరమించి తక్షణం విధుల్లో చేరుతామని ప్రకటించారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా నిరంతరం తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తుంటారు. అలాగే లైన్-మ్యాన్లకు అసిస్టెంట్లుగా వ్యవహరిస్తున్నవారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపొతుంటారు. వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కనుక ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు అధికారికంగా ఎటువంటి సహాయమూ అందదు. కనుక వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి. కనుక తమ పనికి తగిన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని వారు కోరడం న్యాయమే.