భాజపా కుట్రలో తెరాస భాగస్వామి కావద్దు: తెదేపా

ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణాకు కూడా ఇవ్వాలని తెరాస నేతలు కొత్త పల్లవి అందుకోవడాన్ని తెదేపా ఎంపి కొనకళ్ళ నారాయణ రావు తప్పు పట్టారు. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని విభజన సమయంలోనే కేంద్రం హామీ ఇచ్చిందని కానీ మోడీ సర్కార్ మాట నిలబెట్టికోకపోవడంతో దాని కోసం తాము కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. 

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం తమను మోసం చేసిందని ఏపి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, దాని వలన భాజపాకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే తెరాస ద్వారా తెలంగాణాకు కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేయిస్తున్నారని నారాయణ ఆరోపించారు. ఏపికి వ్యతిరేకంగా భాజపా చేస్తున్న కుట్రలో తెరాస పాలుపంచుకోవద్దని ఎంపి నారాయణ తెరాస అధినేత కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణాకు నష్టం జరుగుందనే తెరాస వాదన అర్ధరహితమని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన కారణంగా అన్నివిధాల నష్టపోయిన ఏపి మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరి అని అన్నారు. అది ఏపిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకే తప్ప ఇరుగు పొరుగు రాష్ట్రాలను నష్టపరిచేందుకు కాదని అన్నారు. కనుక ప్రత్యేకహోదా విషయంలో తెరాస కూడా ఏపికి సహకరించాలని తెదేపా ఎంపి నారాయణ విజ్ఞప్తి చేశారు. 

ప్రత్యేకహోదా విషయంలో తెరాస నేతలు అకస్మాత్తుగా మొదలుపెట్టిన వాదనలు తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టి, తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టి-కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికలలో చావు దెబ్బతీయడానికేనని అందరూ భావిస్తున్న  తరుణంలో తెదేపా ఎంపి నారాయణ తెరాస వాదనలో మరొక కొత్త కోణం చూపడం విశేషం. మోడీ సర్కార్ పై తెరాస ఎంపిలు, మంత్రులు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, అవసరం పడినప్పుడు కేంద్రానికి అండగా నిలబడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. బహుశః అందుకే తెరాసను తెదేపా ఎంపి అనుమానిస్తున్నారేమో?