ముస్లిం రిజర్వేషన్లు ఇంకా ఎప్పుడు? షబ్బీర్ ఆలీ

కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలి మొన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ, “ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని దానిని ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుకొంటే భూకంపం సృష్టిస్తానని సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకొన్నారు. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసి డిల్లీకి పంపించి చేతులు దులుపుకున్నారు. దాని గురించి మళ్ళీ మాట్లాడటమే లేదిప్పుడు. పార్లమెంటు సమావేశాలలో దాని గురించి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇంకా ఎప్పుడు పెంచుతారు” అని ప్రశ్నించారు. 

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకొంటున్నామని తెరాస సర్కార్ ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో దానిపై తీర్మానం ఆమోదించేవరకు తెరాస, భాజపా నేతలు పరస్పర విమర్శలు చేసుకొని రాజకీయాలను వేడెక్కించారు. వాటితో ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు కానీ ఆ హామీని ఇంతవరకు నెరవేరలేదు. కారణాలు అందరికీ తెలుసు. 

ఈ అంశంతో తెరాస, భాజపాలు రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు తాము మాత్రం ఎందుకు పొందకూడదనే ఆలోచనతోనే షబ్బీర్ ఆలీ కూడా దీనిపై సిఎం కేసీఆర్‌ను నిలదీస్తున్నట్లున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా దీనిపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగవచ్చు కదా? కానీ అడగదు. ఎందుకంటే, ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఒత్తిడి చేస్తే, కాంగ్రెస్‌ పట్ల హిందూ ఓటర్లలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అది భాజపాకు లబ్ది కలిగిస్తుంది. కనుక కాంగ్రెస్‌ మాట్లాడదు. ఏపిలో ప్రత్యేకహోదా, ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ల అంశం రెండూ రాజకీయ పార్టీలకే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు కాదు.