పట్టుచీరల వ్యవహారంలో ఇద్దరు ఈవోలపై వేటు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారి ఆలయంలో కొలువైన శుభానందదేవి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, శృoగేరీ పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పించిన పట్టుచీరలు కొన్ని నెలల క్రితం మాయం అయ్యాయి. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగే వాటిని దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అప్పుడు ఈవోలుగా పనిచేసిన హరిప్రకాష్, శ్రీనివాస్ లను సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

2016, మే 2వ తేదీన జిల్లాలో మేడిగడ్డ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొన్నారు. ఆ సందర్భంగా అమ్మవారికి బంగారు కిరీటం, పట్టుచీరను సమర్పించుకొన్నారు. ఆ తరువాత శృoగేరీ పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. అవి ముఖ్యమంత్రి, శృoగేరీ పీఠాధిపతి సమర్పించిన చీరలని గుర్తించని ఆలయ ఉద్యోగి వాటిని దొంగతనం చేశాడు. కేసీఆర్ దంపతులు సమర్పించిన బంగారు కిరీటం అతని చేతికి చిక్కలేదు లేకుంటే అదీ మాయం చేసి ఉండేవాడే.