వాళ్ళ ఓట్లు నాకు అక్కరలేదు: రాజా సింగ్

హైదరాబాద్, ఘోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ తీరే వేరు. భాజపాది హిందుత్వ అజెండా కావచ్చు కానీ అయనది అతివాద హిందుత్వ అజెండా. అదే ఆయనకు ప్లస్ పాయింట్..మైనస్ పాయింట్ కూడా. ఆ అతివాధమే ఆయనకు రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు కల్పించింది. కానీ అదే కారణంగా పార్టీలో ఇతర నేతలు ఆయనకు దూరంగా ఉంటారు. అయన కూడా వారికి దూరంగా ఉంటారు. రాజా సింగ్ తన అతివాద ధోరణిని కొనసాగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“నాకు ఆవు మాంసం తినేవారి ఓట్లు అవసరం లేదు. హిందువుల ఓట్లే చాలు. ఈ మాట ఇదివరకు చాలాసార్లు చెప్పాను. వచ్చే ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మళ్ళీ చెపుతాను. దేశంలో హిందువులు, హిందూమతం పరిరక్షణ కొరకే భాజపా పుట్టింది. దేశంలో మజ్లీస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేసినా నన్ను అక్కడకు వెళ్లి ప్రచారం చేయమని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు,” అని రాజా సింగ్ అన్నారు. 

ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనసులు నొప్పిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి ఓట్లు తనకు అవసరం లేదని చెప్పడం హిందువులను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నంగానే చూడాలి. అది ఫలిస్తుందో లేదో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తే కానీ తెలియదు. కానీ ఒక నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రతినిధిగా వ్యవహరించవలసిన వ్యక్తి ఈవిధంగా మాట్లాడటాన్ని ఎవరూ హర్షించలేరు. అలాగే భాజపా, దాని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురించి అన్నమాటలు ఆ పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంది.