కాంగ్రెస్‌ నేతలకు కూడా పంటపెట్టుబడి ఇస్తున్నాం: హరీష్

గురువారం మెదక్ జిల్లాలో ఆర్టీసి బస్సు డిపో నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు అనంతరం జరిగిన బహిరంగ సభలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిత్యం విమర్శిస్తూ, కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ నేతలు కూడా తమ ప్రభుత్వం రైతుబంధు పధకం క్రింద అందిస్తున్న పంటపెట్టుబడి చెక్కులను తీసుకొంటున్నారని అన్నారు. నర్సాపూర్ కు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా పంటపెట్టుబడి సాయాన్ని స్వీకరించారని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరిపట్ల వివక్ష చూపడంలేదని చెప్పేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలకు మొహం చెల్లక చీకటి పడిన తరువాత కార్యాలయాలకు వచ్చి రైతుబంధు చెక్కులను తీసుకువెళుతున్నారని అన్నారు. మళ్ళీ దసరా పండుగకు రెండవ విడత పంట పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

ఆగస్ట్ 15వ తేదీ నుంచి రైతుభీమా పధకం  ప్రారంభించబోతున్నామని హరీష్ రావు తెలిపారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో రైతులను పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం, రైతుల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని ప్రజలందరూ గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నంతవరకే ఈ అభివృద్ధి, సంక్షేమ పధకాలన్నీ సజావుగా సాగుతాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్నీ నిలిచిపోతాయని చెప్పారు. కనుక వచ్చే ఎన్నికలలో తమ పార్టీని గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు.